Book Description
మనుస్మృతి నాటినుండి వస్తూన్న సాంఘికసూత్రాలలో నుండి స్త్రీ స్వాతంత్య్రము పురుషులతో సమానహక్కులు వంటి ఆధునిక అభిప్రాయాలలోకి, క్రమపరిణామము చెందుతూన్న భారతనారి, లేక ఆంధ్ర మహిళ, ఆధునిక మనః ప్రవృత్తి భావుకురాలైన రమాదేవి భావాలలో స్పష్టంగా కనపడుతుంది ఈమె రచనలు చదువుతూంటే. అందుకే వేదకాలంలో వేదాంత జిజ్ఞాస చేసిన గార్గియో, మైత్రేయో బౌద్ధయుగంనాటి యశోధరో, ఆమ్రాపాలీయో, ఇంకా ఆయా యుగాలనాటి యే మహిళో లేకపోతే చలంగారి యే స్త్రీ పాత్రో రచయిత్రి మనోభావాలలో తాద్మాత్మ్యం పొంది స్త్రీ అంటే విశ్వసుందరి, విశ్వప్రియ, విశ్వజనని అనే ఆదర్శాన్ని తలపింపచేస్తూంటుంది. స్త్రీలు కవయిత్రులైనా, రచయిత్రులైనా వారి స్వభావంలోను, రచనలోను పురుష సహజమైన కరకుతనమూ, మోటుతనమూ కూడా తొంగిచూడడం కద్దు. అలావుండక కోమలంగాను, సుకుమారంగాను వ్రాసే కొద్దిమంది రచయిత్రులలో రమాదేవి ఒకరు. పైగా ఈమె న్యాయవాద పట్టభద్రగూడ కావడంచేత ఆమె భావన సుతర్క నిర్ధిష్టమై సూటిగా వుంటుంది. ‘‘మనిషి దేవుడిగా మారడానికి సంఘం సాధనంగా ఉపయోగపడాలి. వ్యక్తి సంఘానికి విరోధి కాడు. సంఘం వ్యక్తిని తనచేతిలో కీలుబొమ్మని చేసుకొనే నియంతకాదు. వ్యక్తి మనుగడకి అతనిని తన గమ్యానికి చేర్చడానికి ప్రకృతిమాత ప్రసాదించిన స్నేహశీలి, సుగమమార్గం మాత్రమే - సంఘం!’’