Book Description
లోకంలో మనకి తల్లులు నాలుగు స్వరూపాలుగా ఉంటారని చెపుతుంది శాస్త్రం. అందులో ఒకటి జనకమాత. అంటే శరీరాన్ని ఇచ్చిన తల్లి. రెండవ వారు భూమాత. ఈ భూమి తల్లి. రెండవది శ్రీమాత. నాలుగవది గోమాత. అందుకనే నలుగురుగా ఉంటుంది. ఇందులో చాలా చాలా గమనించతగ్గ విషయమిటంటే వేదం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రకటించింది. ఒక వస్తువుని దానం చేసారనుకోండి. ఒక పంచెల చాపు పట్టుకువెళ్ళి ఎవరికో దానం చేసారనుకోండి ''ఇదం న మమ'' అంటూ. మీరు ఒక పంచెల చాపు దానం చేసారని మీ ఖాతాలో వేస్తారు. రెండు పళ్ళు ఇచ్చారనుకోండి. మీ ఖాతాలో రెండు పళ్ళిచ్చారని వేస్తారు. ఒక ఆవుని ఇస్తే 1000 ఆవులు ఇచ్చారని ఖాతాలో వేస్తారు ఎందుచేత అంటే వేదం గోమాత విషయంలో అంత విశాలహృదయంతో మాట్లాడింది. మరి 1000 గోవులు ఇచ్చిన ఫలితం మీ ఖాతాలో వేశారనుకోండి. మరి పుచ్చుకున్నవాడి ఖాతాలో కూడా 1000 పుచ్చుకున్న ఫలితం పడుతుందా? కచ్చితంగా పడుతుంది. అన్ని గోవులు దానం పుచ్చుకున్నపుడు ఆయన తేజస్సు క్షీణిస్తుంది. కాబట్టి ఆయనెంత గాయత్రి చెయ్యాలి? లౌకికంగా చూసినపుడు వచ్చింది ఒక గోవు. కానీ ఆయన ఆధ్యాత్మికపు ఖాతాలో మాత్రం 1000 గోవులు దానం పట్టినట్టు వేస్తారు. వేదం అంది ఒక్క గోదానం పుచ్చుకున్నపుడు మాత్రం నీళ్ళు విడిచి పెట్టి గోదానాన్ని పుచ్చుకుంటే పుచ్చుకున్న ఉత్తరక్షణంలో అక్కడ ఉండకుండా పక్కకివెళ్ళి కొంతసేపు ఒక మంత్రం జపం చేయమని చెప్పింది. ఆ జపం చేస్తే తప్ప వేరు గోవులు పుచ్చుకున్న స్థితిపోదు. ఆ మంత్రజపం చేస్తే ఒక్క గోవు పుచ్చుకున్న స్థితిని అతని ఖాతాలో వేస్తారు. మీకు మాత్రం 1000 గోవులు ఇచ్చినట్లు వేస్తారు.