Book Description
అందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా,పాలనురగ లాంటి తెల్లటి దుస్తులతో,మెల్లగా మెట్లు దిగివస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపుపచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింది హాలులో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదనే నిల్చినా, తన కళ్ళుమాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. ప్రీతి పాదం ఆఖరి మెట్టు మీదకు రాగానే శరత్ చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబి అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో “మీ ఉత్తరానికి జవాబు ఇదే!”అంది. మగసిరి నిండిన అతని చేతివేళ్ళు ఆపువ్వుని అందుకున్నాయి.”థ్యాంక్ యూ”అతను అస్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ పువ్వుని వదల లేదు. అతనివైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు. దూరం నుంచి ఒక వయససుమళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.అతని ముఖంనిండా దెబ్బలు తగిలి మానినట్లుగా గాట్లు,మచ్చలు ఉన్నాయి.మొరటుగా వున్న అతనిపెదవులమీద క్రూరమైన చిరునవ్వు మెదలింది. ఆనవ్వు అతని ముఖంలో వున్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది.