Book Description
శ్రీ.శా.గా పిలుచుకునే ఆత్మీయుడు పురాణం శ్రీనివాసశాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాధపురంలో జన్మించారు. తల్లిదండ్రులు పురాణం సీత, సుబ్రమణ్యశర్మ. భీమిలి సాగరతీరంలోని డచ్ శిధిలాల వద్ద ఆయన సాహితీ వ్యాసంగం మొదలు కాగా, విశాఖ సీతమ్మధారలో వార్తల ప్రవాహం మొదలైంది. కాల్పనిక సాహిత్యంతో పాటు, సైకాలజీకి సంబంధించిన కథలు రాయడం శ్రీ.శా. స్పెషాలిటీ. అదే సమయంలో వార్తల్లో విశేషాలను కథలుగా మలచడంలో ఆయన దిట్ట. యువతరం ప్రేమ గురించి ‘పొంగేటి సంద్రాన’ అనే చిన్న నవల రాసినా, క్లెర్ వాయిన్స్ అనే పక్రియ గురించి ‘అతనికంతా తెలుసు’ అనే కథ రాసినా శ్రీ.శా.కే చెల్లింది. పురాణంవారింట పుట్టి లొల్లవారింటికి వెళ్లిన దత్తుడు శ్రీనివాసశాస్త్రి. తాతగారి ఇంటి పేరుకు కూడా గుర్తింపుతెచ్చే ఉద్ధేశంతో ఆంధ్రభూమి దినపత్రికలో ఒక ఫీచర్‍కు ‘లొల్లి’ అని పేరు పెట్టారు. హైదరాబాదీ ఇరానీ హోటళ్లలో దొరికే లుక్మీ గురించి ఆయన రాసిన తీరు చూస్తే వెంటనే తినాలనిపిస్తుంది. వార్తలకు హెడ్డింగులు పెట్టడంలో కూడా ఆయన శైలి భిన్నంగా ఉంటుంది. ‘మేమే గెలుస్తాము బ్రదర్’, ‘ఈ మల్లెల బాబ్జీ ఏ పార్టీ బిడ్డ?’ వంటివి మచ్చుకు కొన్ని. విరించి, వంశీ వంటి వారి మెప్పు పొందిన శ్రీ.శా.తో కలసి పనిచేయడం, క్లాక్ టవర్ దగ్గర ఆరుబయట ఖుర్షీద్ హోటల్ లో డ్యూటీ బ్రేక్ లో కబుర్లు, నైట్ డ్యూటీ విరామంలో గార్డెన్ రెస్టారెంట్ ఇరానీ చాయ్ మరచిపోలేని అనుభూతి.