Book Description
మహాకవి జయదేవుడు 11, 12, శతాబ్దాల మధ్య కాలము వాడని చెప్పవచ్చు. పద్మావతి ఇతని భార్య, ప్రేయసి. కొందరు పండితులు ఈమె భార్యకాదని వాదిస్తున్నారు. జయదేవుడు గీత గోవిందం ఆలపిస్తూవుంటే పద్మావతి నృత్యం చేసేదట. ఆయనది గానం. ఆమెది నృత్యం. అతనిది భావం. ఆమెది లాస్యం. అతనిది కననం. ఆమెది నటనం. ఎవరేమని వాదించినా సంగీత సాహిత్య సమ్మేళనం ఆ జంట. అందుకే జయదేవుడు తనని ‘‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తిగా’’ చెప్పుకున్నాడు. ఈ కావ్యంలో 24 తరంగాలు, 78 శ్లోకాలు వున్నాయి. మధుర భక్తికి ఈ కావ్యం మహత్తరమైన ఉదాహరణ. శ్రీహరిని సర్వశృంగార మూర్తిగా ఉపాసించారు జయదేవుడు. అంతర్గతంగా అష్టవిధ నాయికా వర్ణన వుంది. భగవంతుడిని పురుషుడిగా, భక్తుని స్త్రీగా ఊహించి వారిమధ్య శృంగారాన్ని వర్ణించడం ఈ మధుర భక్తి లక్షణం. ఏది ఏమైనా రసహృదయులకు కావలసిన రక్తీ, ఆధ్యాత్మికులకు కావలసిన భక్తీ, నమ్మకం వున్న వారికి ముక్తీ అన్నీ లభిస్తాయి. ఈ కావ్యంలో ఎవరు ఏది కావాలనుకుంటే అది కనిపిస్తుంది.