Book Description
మనబ్ ముఖర్జీ ఇంటికి వచ్చాడు. తలుపులు తెరచి- ‘‘మోతీ!’’ అని పిలిచాడు. మోతీ పెరట్లో తెగ ఆయాసపడ్తూ నేలమీద మట్టిని ముందుకాళ్లతో లాగుతోంది. బాగా అలసిపోయింది. ‘‘హరే...మోతీ! ఏంటిది? చూడు నీ కాళ్లకు రక్తం వచ్చేసింది. నాకుకాపలా వుంటావంటే ఇలా గోతులు తవ్వుతున్నావేంటి? పదపద!’’ అని దాన్ని మెల్లిగా నడిపించుకుంటూ ఇంట్లోకి తెచ్చాడు. మోతీ మళ్లీ పెరటివైపే చూస్తోంది. దాని ఒళ్లు నిమిరి ముందరి కాళ్లు కడిగాడు. పంజాలపై నెత్తురు గాయాలు అయ్యాయి. ‘అలా వదిలేస్తే సెప్టిక్ అయి జబ్బు పడుతుంది’ అని వెంటనే పశువుల డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. ‘‘ఇది పోలీస్ డాగ్. మీ దగ్గరెలా ఉంది?’’ అడిగాడు వైద్యుడు. విషయం చెప్పాడు ముఖర్జీ. ‘‘నిజమే. ఇది మంచి జాతి కుక్క. చాలాసార్లు దీనికి ట్రీట్‍మెంట్ ఇచ్చాను నేను. ఇంతకూ కాలికి దెబ్బలు ఎలా తగిలాయి?’’ పరిశీలనగా చూస్తూ అడిగాడు డాక్టర్. ‘‘ఇది పెరట్లో మట్టి తవ్వుతోంది’’ ‘‘కుక్కలకు వయస్సు పెరిగే కొద్దీ మట్టిలో చిన్నకన్నాలు చేసి పడుకుంటాయి. బహుశా ఆ మట్టి ఎండకు బాగా ఎండిపోయి ఉంటుంది. పంజాలపై లోతుగా గాయాలు అయ్యాయి.’’ అంటూ డాక్టర్ మందులు వేసి కట్టుకట్టి ఇంజక్షన్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి పంపించాడు. మనబ్ ముఖర్జీ కుక్కను టాక్సీలో ఇంటికి తీసుకు వచ్చాడు. మళ్లీ పెరట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తపడ్డాడు. - కుక్క ఇచ్చిన క్లూ 50 కథలున్న ఈ పుస్తకంలో ఏ కథకి ఆ కథే గొప్పగా, అద్భుతశైలిలో రచించబడి మొదలుపెట్టిన దగ్గర్నుంచి చివరివరకూ వదిలిపెట్టకుండా చదివించగల క్రైం, సస్పెన్స్లు కలగలిపిన ఈ కథల పుస్తకం చదవండి.