Book Description
హనుమంతుడు వాయువు యొక్క ఔరస పుత్రుడు. వజ్రము వంటి శరీరము, గరుడునితో సమానమగు వేగము గలవాడు. శ్రీరామలక్ష్మణులు పంపాసరస్సుదాటి ఋశ్యమూక పర్వతప్రాంతమున సంచరించుట చూచిన సుగ్రీవుడు వారిరువురు వాలి పంపబడినవారై యుందురని భయపడి ‘‘వారి మంచిచెడులను వారి మాటలచే తెలిసికొనుమ’’ని చెప్పి రామలక్ష్మణులు ఉన్న ప్రదేశమునకు హనుమంతుని పంపెను. సేవా దర్మపాలనమున మేటి అయిన హనుమంతుడు మలయపర్వతమున ఉన్న సుగ్రీవుని వద్దకు వెళ్ళినపుడు ప్రభువుకు విశ్వాసము కలిగించవలెనని సన్యాసి రూపముననే వెళ్ళెను. రామసుగ్రీవులు మైత్రికి ఒడంబడిక, పరస్పరము ఆలింగనముచేసుకొనిన పిదప తిరిగి వానర రూపమును స్వీకరించెను. సీతాన్వేషణకై శ్రీరామునిచే లంకకు పంపబడి అక్కడ సీతను కనుగొని శ్రీరాముని అంగుళీయకమునిచ్చి రామసందేశమును వినిపించెను. యుద్ధంలో లక్ష్మణుడు గాయపడగా సంజీవని పర్వతమును పెకలించి తెచ్చి లక్ష్మణుని బ్రతికించి రామునికి మరల జీవితేచ్ఛ కలిగించెను. రావణుని చెరనుండి సీతను విడిపించుటలో హనుమంతుని పాత్ర అమోఘం. ఈ లోకమున రామచరితామృతము వెలసిల్లుచున్నంతకాలం హనుమంతుడు చిరంజీవి.