Book Description
బుక్ సైజ్లో భారతీయ తత్వాన్ని పరిచయం చేయగలవా? అనగానే అత్యాశతో, ఒక్క చుక్క చూసి సముద్రమంతా తెలుసుననుకుని పరుగెత్తే మూర్ఖుడి అహంకారంతో ‘సరే’నన్నాను. కానీ ఒక్కో అక్షరం గురించి కొన్ని వేల ఏళ్లుగా పండితులు చర్చలు, వాదోపవాదాలు జరుపుకున్నా ఏమీ స్పష్టంగా తేలని అంశాల గురించి వంద పేజీల్లో రాయాలనుకోవటం మూర్ఖత్వమేనని తెలుస్తూన్నా, భారతీయతత్వం గురించి నా అభిప్రాయాలను పాఠకుల ముందు ఉంచే అవకాశాన్ని వదలుకోలేని ‘అత్యాశ’ - ఏదో చెప్పగలనన్న అహంకారం నన్ను ఈ కార్యాచరణకు ప్రోత్సహించాయి. దేవదూతలు ఆరంభించేందుకు భయపడే పనులను మూర్ఖులు చేస్తారనేందుకు ఇది మంచి ఉదాహరణ. నా ఈ ప్రయత్నం అసమగ్రం, అసంపూర్ణం అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ పుస్తకం చదివిన ఏ ఒక్కరయినా మన ప్రాచీన తత్వం పట్ల, ధర్మం పట్ల కుతూహలం కలిగితే నా ఈ ప్రయత్నం సఫలమైనట్లే భావిస్తాను.