Book Description
పితావై గార్హ పత్యోగ్నిర్మాతాగ్నిర్దక్షిణం స్మతః। గురురాహవనీయస్తు సాగ్ని త్రేతా గరీయసి।। తండ్రి గార్హపత్యమనే అగ్ని. తల్లి దక్షిణాగ్ని. గురువు ఆహవనీయమనే అగ్ని... ఈ మూడు అగ్నులు ఎంతో శ్రేష్ఠమైనవి. వ్యక్తి జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిర్దేశించి, అతడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రులు గురువు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తారన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా, తల్లిదండ్రి అందించే కుటుంబ వాతావరణం వ్యక్తిత్వ ఎదుగుదలకు బీజం వేసి, నీరు పోస్తుంది. ఇలా ఎదిగిన మొక్కకు దిశనిచ్చేది గురువు, సామాజిక వాతావరణం. అయితే ఒకే రకమయిన వాతావరణంలో ఎదిగి కూడా వ్యక్తులు భిన్నమైన మార్గాలలో ప్రయాణిస్తారు. బాల్యంలో ఎదురైన చేదు అనుభవాల ఆధారంగా, తమ వ్యక్తిత్వం ఊతగా, తమ జీవితానికి ఒక అర్థాన్ని ఏర్పరచుకుంటారు. కానీ జీవితాంతం బాల్యం తాలూకు అనుభవాలు వారిని వెన్నాడుతూంటాయి. అంటే బాల్యం అనుభవాలు విధించిన పరిమితులను అధిగమించి విజయం సాధించినా, వాటి ప్రభావం మాత్రం వారిని వీడదన్నమాట. ఇలా బాల్యంలో తల్లిదండ్రుల ప్రభావం ఆధారంగా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని విజేతలుగా ఎదిగిన ప్రముఖుల జీవితాలను పాఠకులకు చేరువ చేస్తాయి. తద్వారా వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన కలుగజేసే పుస్తకం శైశవగీతి.