Book Description
రాజస్థాన్‍కు చెందిన పర్వతప్రదేశంలో రూపనగర్ అనే పేరుతో చిన్న రాజ్యమొకటి ఉన్నది. రాజ్యం చిన్నదయినా, పెద్దదయినా రాజు అనేవాడు ఉంటాడుగదా! రూపనగర్‍కు కూడా ఒక రాజున్నాడు. రాజ్యం చిన్నదయినా పేరు గొప్పగా ఉండడంలో అభ్యంతరమేమీ లేదుగదా! రూపనగర్ రాజుపేరు విక్రమసింహుడు రాజ్యం చిన్నది. రాజధాని చిన్నది, నగరం కూడా చిన్నదే! ఆ నగరంలో ఒక భవనము మాత్రం అతి సుందరంగా అలంకరించబడి వున్నది. అది రాకుమారి మందిరం. ఒక వృద్ధురాలు చిత్రాలు అమ్ముకుంటూ ఆ మందిరం వద్దకు వచ్చింది. అక్కడ భువనమోహినియైన సుందరిని చూసి చిత్రాలు తెచ్చిన ఆ వృద్ధురాలు ప్రణామాలాచరించింది. ఆ సుందరి రూపనగర మహారాజు కూతురైన చంచలకుమారి! హాస పరిహాసాలాడుతున్న యువతులందరూ ఆమె చెలికత్తెలు. వాళ్ల పరిహాసాలకు ఆమె చిరునవ్వు నవ్విందేకాని మారు మాట్లాడలేదు. ‘‘ఎవరు నువ్వు?’’ అని ప్రశ్నించింది రాకుమారి చంచలకుమారి ఆ వృద్ధురాలివైపు తిరిగి. ‘‘ఈమె చిత్రాలు అమ్మడానికి వచ్చింది’’ అని చెలికత్తెలు చెప్పారు. రాకుమార్తె ముసలిది తెచ్చిన చిత్రపటాలు చూడాలనే కోర్కె వెళ్ళబుచ్చింది. ముసలిది వరుసగా చూపించడం ప్రారంభించింది. రాజపుత్రిక వాటినన్నింటినీ ముసలిదానికి ఇచ్చివేస్తూ ‘‘ఇవి అక్కరలేదు. వీళ్ళల్లో ఎవరూ హిందువులు లేరు. ముసల్మానులకు బానిసలు వీళ్ళంతా’’ అని అన్నది. ముసలిది మరికొన్ని చిత్రాలను తీసి చూపిస్తూ ఒక చిత్రపటాన్ని చూపించకుండా లోపల దాచిపెట్టింది. ఆ చిత్రం ఎవరిదో చూపించు, చూస్తాను’’ అని రాకుమారి అన్నది. ‘‘రాజా రాజసింహుడిది’’ అని ముసలిది భయపడుతూ చెప్పింది. రాకుమారి చిరునవ్వు నవ్వింది. ‘‘వీరపురుషులెవరూ స్త్రీలకు శతృవులుకాదు. నేనీ చిత్రాన్ని కూడా తీసుకుంటాను’’ అని రాకుమారి అన్నది. చిత్రాన్ని చేతిలోకి తీసుకొని రాకుమారి చాలాసేపు అలాగే దాన్ని చూస్తూ వుండిపోయింది. చూస్తూనే చూస్తూనే ఆమె ముఖం విప్పారింది. నేత్రాలు వికశించాయి. ఇక చదవండి.