Book Description
మహాకవి కాళిదాసుకు రోజూ ఒక తోటమాలిని పూలు తీసుకెళ్లి యిస్తూ వుండేదట. కాళిదాసు బీదబ్రాహ్మణుడు. పూలకు డబ్బిచ్చుకునే తాహతు లేదు. డబ్బులు బదులు తాను రచించిన కవిత్వాన్ని ఆమెకు విన్పిస్తూ వుండేవాడట. ఒకరోజున మాలిని సరోవరంలో ఒక అందమైన తామరపూవు వికసించిందట. ఆమె దాన్ని తెచ్చి కాళిదాసుకు బహూకరించింది. కాళిదాసు ఆ బహుమానానికి బదులు ఆమెకు ‘మేఘదూత’ విన్పించడం ప్రారంభించాడు. ‘మేఘదూత’ కవిత్వం ఆ మాలినికి అర్థం కాలేదు. ఆమె వెళ్లిపోవడానికి లేచి నిల్చున్నది. ‘‘లేచావేఁ?’’ అడిగాడు కవి. ‘‘ఏం చేయను మరి! నీ కవిత్వంలో రసం లేనిదే!’’ అన్నది మాలిని. ‘‘అయితే నీకు స్వర్గప్రాప్తి లేదు’’ అన్నాడు కవి. ‘‘ఎందుకని?’’ ‘‘స్వర్గానికి వెళ్లాలంటే కొన్నిమెట్లు ఎక్కాలి. లక్ష యోజనాల వరకు అలా మెట్లమీద ప్రయాణించవలసినదే. ఆ తరువాతగాని స్వర్గం కన్పించేది. అలాగే ప్రారంభంలో నా కవిత్వం కూడా కొంత నీరసంగా వుండవచ్చు. ప్రశాంతంగా ముందు నాలుగైదు మెట్లవరకే వెళ్ళలేకపోతే, ఇక లక్షయోజనాల దూరం నువ్వేం నడుస్తావు?’’ అన్నాడట కవి కాళిదాసు. మాలిని ఈ బ్రాహ్మణుడు తనను శపిస్తాడేమోనని భయపడింది. విధిలేక చివరిదాకా ఆ ‘మేఘదూత’ కావ్యం విన్నది. కావ్యమంతా విని చాలా సంతోషించినదై దానికి ప్రత్యామ్నాయంగా ఆ రెండవరోజున మదనమోహిని అనే పేరుగల అందమైన పూలమాల తెచ్చి ఆయన మెడలో వేసిందట. ఈ పుస్తకాన్ని దానితో పోల్చడానికి వీల్లేదు. ఇందులో స్వర్గమూ లేదు, లక్ష యోజనాలవరకు మెట్లూ లేవు. రసం అంటూ ఏదో కొంత వున్నది. మెట్లుకూడా అట్లే లేవు. పాఠకులలో ఎవరైనా ఆ తోటమాలిని వలె చప్పగా వున్న నోరు చప్పరిస్తే వాళ్ళతో చెప్పదలచినదేమిటంటే ‘ఈ మెట్లు దాటితేగాని రససాగర సందర్శనం లభించదు’’ అని.