Book Description
‘‘నాన్నగారూ, నాన్నగారూ! అమ్మకు ఓ చిన్ని అమ్మాయి పుట్టింది’’ అంటూ గురుచరణ్‍బాబు మూడో కూతురు అన్నకాళీ యీ శుభవార్తను, వరండాలో కూర్చొని తన ఆలోచనలో మునిగివున్న తండ్రిచెవిన వేసింది. గురుచరణ్‍బాబు ధర్మపత్ని అయిదో కాన్పులో గూడా నిర్విఘ్నముగా కన్యారత్నాన్నే కన్నది. తన పదేళ్ళకూతురు అన్నకాళీ ద్వారా ఈ వార్త విని గురుచరణ్‍బాబు చాలా చింతాక్రాంతుడయిపోయాడు. యేమీ మాట్లాడలేకపోయాడు. బాగా శిథిలమైపోయిన తాతలనాటి తలగడను తలక్రిందికి జరుపుకొని పండుకొన్నాడు. అమ్మాయి పుట్టిందని వినగానే ఆ బలహీనుడు యెంతో నీరసించిపోయాడు. అతికష్టంమీద దీర్ఘంగా నిట్టూర్చాడు. చేతిలోని బెత్తంలాగా చిక్కి సగమైపోయిన ఆ శరీరమే అతడి బలహీనతకు సాక్ష్యం. ఆయన బాడుగబండి లాగే బక్కగుర్రం కన్న యేమీ మేలైనవాడు కాడు. నిరుద్యోగులతో నిండివుండే కలకత్తా మహానగంలో అరవై రూపాయల జీతంతో అరవచాకిరి చేస్తున్న ఈ చిరుద్యోగి గొప్పవాళ్ల గుర్రబ్బండి లాగే అరబ్బీగుర్రంలాగా యెలా బలిసి వుండదలడు? ఆ పరమేశ్వరుని దయవలన అతడు తన జీవిత చక్రాన్ని యేదోవిధంగా దొర్లించుకుపోతున్నాడు అదే పదివేలు!