Book Description
వంద గజాల దూరంలో ఉండిపోయిన సుందరమూర్తి తెలుసుకొన్నాడు.. ఆ వెళ్ళిపోయింది తను ఎక్కవలసిన రైలు.. అది తను ఎక్కకుండానే వెళ్ళిపోయింది. ఇంతదూరం ప్రయాణించి, ఎక్కవలసిన రైలు అందుకోలేక మిగిలిపోయాడు తను. తను చుట్టుదారి పట్టకుండా సూటిదారిన ప్రయాణిస్తే ఈ సరికి ఏ అరగంట కిందటో స్టేషను చేరుకొని ఉండేవాడు. ఎక్కుదామనుకొన్న రైలు ఎక్కి చేరుదామనుకున్న గమ్యం చేరి ఉండేవాడు. కాని, ఇప్పుడింకేం లాభంలేదు. తను ఎక్కవలసిన రైలు వెళ్ళిపోయింది. తిరిగి ఇంకో రైలు వచ్చేదాకా దానికోసం నిరీక్షిస్తూ అలా ఉండవలసిందే... సుందరమూర్తి ఎక్కవలసిన రైలు, అతడు ఎక్కకుండానే వెళ్ళిపోతున్న రైలు వెనక వున్న ఎర్రదీపాలు అతన్ని చూసి వెక్కిరిస్తున్నాయి. కాలం విలువ తెలుసుకోలేని ఓ బుద్ధిహీనుడా... జీవితంలోకి నీకిది ఒక గుణపాఠం, అంటూ హెచ్చరిస్తున్నాయి.