Book Description
ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి… యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న ఒక శోకవనితవైన నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, మన కేళీ విన్యాసాల ఉద్గృంధ గవాక్షాలు తెరచి, ఓసారి పరిభ్రమించి అనంతరం క్రమించి, రమించి, ఉపశమించి, అలసటతో దగ్ధమై, ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా ప్రగాఢమయిన తపన, యాతన, వేదన. కానీ కాలం? నన్ను నువ్వు, నిన్ను నేను అందుకోవాలని కాంక్షతో ఎంతగా కాలిపోతున్నామో అంతగానూ దూరం చేస్తుందీ కాలం. ఔను. నేను కాలానికి ఎదురీదలేక, రాసే రాతల్లోనే స్వర్గసౌధాల్ని నిర్మించి, ప్రేరేపించి నిన్ను శోకింపజేస్తున్న పిరికివాడ్ని, నీచుడ్ని, అర్భకుడ్ని ఔనా? లేకుంటే, నీకంటే ఈ ప్రపంచంలో ఎవరూ అధికులు కారని తెలిసికూడా వందల మైళ్ళు దూరం పారిపోయి ఉద్యోగం, ధర్మమంటూ నిన్ను ఆ నది ఒడ్డున ఒంటరిగా వదిలివేయడం నేరంకదూ? పాపం కదూ? నీ లేఖల్లో జాలిగా జారే కన్నీటి ధారలు ఇక చూడలేను. నీకోసం నేను వచ్చే సమయం ఆసన్నమయింది. మరో పది రోజులు పోయాక ఇంకో ఉత్తరం రాసారు. జవాబు రాలేదు. రెండు వారాలు పోయాక ఇంకో ఉత్తరం రాసారు.జవాబు రాలేదు.