Book Description
”గుండెలమీద కాలిన సిగరెట్ మచ్చ పెద్దరచ్చలా ఉంటుంది. ఎఱ్ఱటికళ్ళు- తెల్లటి ఒళ్ళు- తొమ్మిదేళ్ళు. ఈ గుర్తులున్న అబ్బాయి మీకెక్కడైనా కన్పించాడా అయ్యా!” చెన్నై సిటీ స్లమ్ ఏరియాలో అప్పుడప్పుడూ ఒక ఎయిర్‌కండిషన్డ్- మారిస్ కారు అగుతుంది. అందులోంచి దిగిన ఒక ప్రఖ్యాత సినీతార, ఆ క్షణాన ఆమెకి తారసపడ్డ ప్రతీ ముష్టివాణ్ణీ- మురికివాణ్ణీ- కుష్టువాణ్ణీ అలా ప్రశ్నిస్తుంది. వాళ్ళు తెలీదన్నాక, నిరాశతో తిరిగి వెళ్లిపోతుంది.\n*** ”యూ బ్లడీ బాస్టర్డ్. నా బాబుని నాకు కాకుండా దూరం చేస్తావా? జాగ్రత్త! ఆరవసారి జైలు కెళ్ళగలవ్. ఇంకా నిలబడ్డావేం. పోరా ఫో… ఫో…” అలా అవమానిస్తుందామె. ఆమె ఒక పాపులర్ సినీస్టార్. పేరు చాలా అందంగా ఉంటుంది. ”శృతి”. ఆమె మాటల్ని మౌనంగా భరిస్తున్నాడతను. ”నీక్కాదూ చెప్పేది? వెళ్ళు… అసలు వాణ్ణి ముట్టుకునే హక్కూ- అర్హతా యెవరిచ్చారు నీకు?” ”అది కాదు శృతీ!” ”ఇంకేం చెప్పకు. వెళ్ళు. తియ్యటి విషానికి కేంద్రానివి నువ్వు. ఆ గరళాన్ని నువ్వు పనిచేసే ఆ పత్రికలో రాసుకో. ఫో. నా బాబుని కాస్సేపు తనివితీరా చూస్తాను ఫో… ఫో…” మౌనంగా బయటికొచ్చేశాడతను. అతని పేరు చైతన్య. జర్నలిస్టు. ఆమెదీ, అతన్దీ చాలా ఏళ్ళ సంబంధం. రాసుకుంటే అదో పెద్ద ఉద్గ్రంథం.\nఅతనలా వెళ్ళిన మరుక్షణం తన బాబుకి ముద్దుల వర్షం కురిపించింది. వాడిని ఎన్నో ప్రశ్నలు వేసింది. బాబు నవ్వుతున్నాడు. కోటి మల్లెలు విరబూసినట్టూ… కోటి సితారలు మెరిసినట్టూ. కానీ… వాడు ఉలకడం లేదూ… పలకడం లేదు. నిర్జీవంగా నవ్వుతూనే ఉన్నాడు. వాడు… ఒక అందమైన ఫోటో ఫ్రేములో బంధించబడి ఉన్నాడు. బాబు ఫోటోని యథాస్థానంలో అమర్చింది శృతి. శృతి ఉన్మాది కాదు. కానీ బాబు ప్రస్తావనలో ఆమె ఉన్మాదే అయితీరుతుంది.