Book Description
నా ప్రతి కథకీ, నవలకీ ఒక నేపథ్యం వుంది. తీపి జ్ఞాపకాలున్నాయి. ‘ముద్దు’ కథ వ్రాసిన వ్రాతప్రతి మా గురువుగారు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారికిస్తే, ఆయన దాన్ని స్వహస్తాలతో ఫెయిర్‍చేసి ఆంధ్రభూమి ప్రేమకథల పోటీకి పంపించారు. నాలుగో బహుమతి వచ్చింది. ఆ కథ చదువుతుంటే తన మొదటి కథ ‘లవర్స్ మస్ట్లెర్న్’ గుర్తొచ్చింది అని ఆయన ‘అభిషేకం’ అనే కథల సంపుటిలో వ్రాశారు. ‘ఆత్మకథ’ అని ఓ వేపచెట్టు మనోగతం వ్రాశాను. అది మా ఇంట్లో జరిగిన కథ. ఆంధ్రభూమి ‘పెద్ద కథ’ల పోటీలో దానికి మొది బహుమతి వచ్చింది. ‘ఇల్లు’ కూడా మా స్వంత కథే. ‘నేనుసైతం’ అనే కథని క్రిందటి ఏడు అమెరికాలో జరిగిన ‘6వ అంతర్జాతీయ తెలుగు సాహితీ సదస్సు’లో కథ పూరించండి అనే అంశం క్రింద పోటీగా ఇచ్చారు. ‘సీతా మహాసాధ్వి’ కథ మయూరిలో ప్రచురితం. ‘సంధ్యా సమయం’ నేను రోజూ ఈవెనింగ్ వాక్‍కి వెళ్ళినప్పుడు చూసే దృశ్యాల కదంబం. ‘అనంతం’ మానవ సంబంధాల విభాగంలో ఆంధ్రభూమిలో ద్వితీయ, ‘మోసం’ హాస్యకథల విభాగంలో తృతీయ బహుమతి, ‘నన్ను అర్థం చేసుకో’ న్యూజెర్సీ రాజాలక్ష్మీ అవార్డులు పొందాయి. ఇవి నేను వ్రాసిన కథల్లో కొన్ని మాత్రమే. మొత్తం వందకి పైగా ప్రచురితం అయ్యాయి. వాకాటి పాండురంగారావు గారూ, చలసాని ప్రసాదరావుగారూ లాంటి పెద్దలు మొదటిరోజుల్లో ప్రోత్సహించడం నా అదృష్టం.