Book Description
‘‘అమ్మా! నేనొకటి అడుగుతాను అది చెప్పు. నేను అమ్మమ్మా బామ్మల దగ్గరికి వెళ్ళి వస్తుండడం నీకు ఇష్టమేనా కాదా’’ ‘‘ఎందుకిష్టంలేదూ? ఇష్టమే.’’ ‘‘నాక్కూడా ఇష్టం కాబట్టే వెళ్తున్నాను కదా!’’ ‘‘దానికీ నేను అడిగిన ప్రశ్నకీ సంబంధం ఏమిటి రమా?’’ ‘‘సంబంధం ఉందమ్మా. నేనిక్కడ బడిలో, ఇంట్లో కూడా మీతో ఇంగ్లీషులోనే అయితే ఇంక మన ఊరెళ్ళినప్పుడు అమ్మమ్మ బామ్మ నన్ను నోరెళ్ళబెట్టుకుని చూస్తుండిపోతారే తప్ప నాతో కలివిడిగా కబుర్లు కధలు చెప్తారా? నా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థంకాక వాళ్ళ తెలుగు నాకు అర్థంకాక మా మధ్య దూరం పెరిగిపోయి నాకు ఆ ఊరు వెళ్ళాలన్న కోరికే ఉండదు కదమ్మా. ధారాళంగా నేను తెలుగు మాట్లాడగలిగితేనే వాళ్ళ కబుర్లు నాకు నచ్చుతాయి కదా! అప్పుడే వాళ్ళు కూడా నాతో చనువుగా సంతోషంగా ఉండగలుగుతారు. ఔనా కాదా చెప్పమ్మా?’’ ఆశ్చర్యంగా కూతుర్ని చూస్తుండిపోయింది లత. నోట్లోంచి మాటే రాలేదు. ‘‘పాపం అనూని చూస్తే జాలి వేస్తుందమ్మా. ఇంట్లో కూడా వాళ్ళమ్మ నాన్న ఇంగ్లీషులోనే మాట్లాడతారు. అందుకని దానికి తెలుగు కొంచెం కూడా రాదు. ఆ కారణంమూలంగానే అది వాళ్ళమ్మమ్మ ఊరు ఎప్పుడూ వెళ్ళదు. అక్కడ వాళ్ళకి ఇంగ్లీషు రాదు అర్థంకాదు. మనవరాల్లా దగ్గరకి తీసుకుని బోలెడు కబుర్లు చెప్పాలి. నేనూ తెలుగులో చెప్పగలగాలి. అప్పుడే కదా నాకు వెళ్ళాలనిపిస్తుంది అంటుంది. అందుకే నన్ను తనతో తెలుగులోనే మాట్లాడమంది. మెల్లిమెల్లిగా తను కూడా నేర్చుకుంటానంది. తొందర్లోనే నేర్చేసుకుని అమ్మమ్మగారి ఊరు వెళ్తానంది.’’ చెప్పడం ముగించింది రమ. కూతుర్ని దగ్గరికి తీసుకుని పొదివిపట్టుకున్న లత కళ్ళల్లో తడి మెరిసింది. తనలాంటి మహిళలకి తాను చెప్పవలసింది చాలా ఉందని అనిపించింది. మాతృభాషకి దూరంచేసి పెద్దలు చూపించే సహజమైన ఆప్యాయతా ఆపేక్షలని పిల్లలకి దూరం చెయ్యద్దని చెప్పాలని నిశ్చయించుకుంది.