Book Description
గతం తెలియని, తెలుసుకొనని జాతికి భవిష్యత్తు లేదు. గతం అంటే తారీఖులూ తబిశీళ్ళు మాత్రము అనుకోరాదు. ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజానికి రూపురేఖలు దిద్ది, నూతన జవసత్త్వాలు ఇచ్చిన మహనీయుల జీవిత సర్వస్వమే గతం అనాలి. అటువంటి మహాపురుషులలో మన ఆంధప్రాంతానికి చెందినంత వరకు పొట్టి శ్రీరాములు గారొకరు. సామాన్య కుటుంబంలో జన్మించి, అనేక జీవిత సమస్యల్ని ఎదుర్కొని, గాంధీజీ బోధనలతో, సాహచర్యంతో ఆదర్శ జీవితాన్ని ఏర్పరచుకొన్న సుశ్లోకుడు పొట్టి శ్రీరాములు. సత్యం, అహింస, త్యాగం అనే మూడు మహదుర్గుణాలు కలిసిన త్రివేణీ సంగమంగా శ్రీరాములుగారి జీవితకథ సాగింది. ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వారా ఆత్మబలిదానం చేసిన ఆ అమరజీవి కథ నేటి యువతరానికి మార్గదర్శకం. గతం పునాదిగా వర్తమాన సమాజాన్ని నిర్మించి భవిష్యత్తుకు బంగరు బాట వేసే యువతరం శ్రీరాములుగారి జీవిత కథ ద్వారా స్ఫూర్తిని పొందగలరనే మొక్కవోని ఆశతో ఈ రచనను అందిస్తున్నాము.