Book Description
మహారణ్యంలో చాలా ఎత్తయిన కొండల సమూహం మధ్యలోవున్న ఆ చిన్న స్టేషను పేరు గాలికొండపురం రైల్వేగేటు. స్టేషనుకి దిగువగా వుంది ఊరు. అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. వచ్చే రైళ్ళేమీ లేకపోవడంతో నిశ్శబ్దంగా వుందా ప్రాంతం. చేతితో తాకితే చీకటి పొడి రాలుతుందా అనిపించేటంతటి కటిక చీకటి. నిద్రపోని రుషిపక్షుల అరుపులు. ప్రేతాత్మగొంతులా ఎత్తయిన గాలికొండ మీంచి సుళ్ళు తిరుగుతూ వీస్తున్న గాలులు. ఎదుటి మనిషి స్పష్టంగా కన్పించనంత దట్టంగా మూసుకుపోయిన మంచు. కేన్సర్‌లా నరాలు కొరుకుతున్న చలికి మెలికలు తిరుగుతున్న ప్రకృతి కన్య, చీకటి దుప్పటి నిలువునా కప్పుకుంది. గడ్డ కట్టిన ఆ అందంలో చాలా పొద్దు గడిచింది. హఠాత్తుగా శబ్దాలు… స్టేషను మధ్య రైలుపట్టాల మధ్యనున్న ఉడెన్ స్లీపర్స్ మీద వేగంగా పరిగెడ్తున్న బలిష్టమైన ముగ్గురు వ్యక్తుల్ని చేతిలో రివాల్వర్‌తో ఛేజ్ చేస్తున్నాడతను. కొంతదూరం వెళ్లాక రైలుబాట పక్కనే లోయలోకి వెళ్ళడానికి వున్న చిన్న కంకర దారిలోకి దిగి జరజరా జారి, దొర్లి, క్షణాల్లో మాయమయ్యారు ముగ్గురూ. అది గమనించని అతను తిన్నగా ముప్ఫైఏడో నెంబరు టన్నల్‌లో పరుగెట్టి, అలా కొంతదూరం వెళ్ళాక ఆగి వాళ్ళు ఎటువెళ్ళారో అర్థంగాక అటు ఇటు తచ్చాడుతూ కొన్ని క్షణాలు ఒకచోట ఆగాడు. అంతే- రింగ్ ఆకారంలో వుండి గుప్పెటికి సరిపడే చుట్టుకొలతతో వున్న తాడొకటి మెరుపువేగంతో అతని మెడలో పడటం, విడదీసుకునే ప్రయత్నం చేసేలోపే అది బలంగా బిగుసుకుపోవడం జరిగిపోయాయి. ఊపిరాడక గిలగిల్లాడుతున్న అతని ముక్కుకి క్లోరోఫాం నింపిన తెల్లటి సిల్కు గుడ్డ మెత్తగా అద్దబడడంతో క్షణాల్లో స్పృహతప్పి పట్టాలమీద క్రాస్‌గా పడిపోయాడు. సిగ్నల్‌లో ఎర్రదీపం ఆరి పచ్చదీపం వెలగడంతో ముగ్గురూ అక్కడ్నుంచీ పరుగుపెడ్తూ వెళ్ళిపోయారు. కాస్సేపటికి అతను పడున్న పట్టాలమీదుగా ఏభై లోడు వేగన్లు బిగించివున్న పొడుగాటి గూడ్సు ట్రైను శరవేగంగా ప్రయాణిస్తూ వస్తోంది. పడివున్న అతనిలో కదలిక లేదు. బాగా దగ్గరకొచ్చేసిన ట్రైను అతన్ని ముక్కలుగా చీల్చుకుపోవడానికి ఇక పది అడుగుల దూరం మాత్రమే ఉంది. అతనికి క్లోరోఫాం మత్తు వదలడానికి ఇంకా రెండు గంటలు పడ్తుంది.