Book Description
”ఆలయానవెలిసిన ఆదేవునిరీతీ ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతీ” అన్నాడో సినీ కవి. అది అక్షరాల నిజమయిన మాట. ధనవంతుల కుటుంబాలలో వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎవరిబ్రతుకులు వారే స్వతంత్రంగా బ్రతకడానికై ఆరాటపడ్తారు. కాని మధ్య తరగతి బ్రతుకులే పెనుభారమయినవిగా ఉంటాయి. పైగా భర్త ఉద్యోగస్థుడయితే ఆర్థిక అవసరాల కోసం గిరిగీసుకొని బ్రతకాల్సి వస్తుంది. భార్య అభిమానవతియై కుటుంబ బారాన్ని గుట్టుగా మోయగలిగితేనే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. ఇక తమ ఆడంబరాలకు విలాసాలకు భర్తతో అప్పులు చేయించి, అవి తీర్చలేక జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకొంటారు కొందరు. తన భర్త పరువు ప్రతిష్ఠలను కాపాడటానికై అభిమానవతియైన గృహిణి పడే తాపత్రయం ఈ నవలలో కనిపిస్తుంది. ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగారి కలం సృష్టి ఈ ‘కల్పవృక్షం’ నవల. ఉద్యోగస్థుడయిన మధ్యతరగతి కుటుంబం శేఖర్‌ది. మూర్తీ భవించిన భారతీయ నారి ప్రభావతి. వారి అన్యోన్య దాంపత్యంలో చెలరేగిన తుఫాను కష్టాలు కన్నీళ్లు అత్త ఆడబిడ్డల ఆరళ్ళు తరువాత సద్దుమణిగిన తీరుని రచయిత్రి సహజంగా చిత్రీకరించారు. ప్రతి మధ్యతరగతి కుంటుంబం తమ కథగా భావించే నవల ఇది తప్పకుండా చదవాల్సిందే.