Book Description
‘‘కృష్ణా! మోక్షం కోసం, ఆరాటం, ఆవేదనా తప్ప నేనేం సాధించాను? నా కృష్ణయ్యను నాలోనే బంధించుకున్నాను. శ్రీకృష్ణ తత్త్వామృతాన్నీ, రాధామాధవుల మధుర ప్రేమామృతాన్నీ, నేను మాత్రమే ఆస్వాదించి, అనుభవించి దైవద్రోహం చేశాను. పదిమందికీ అందించి, జన్మను సార్థకం చేసుకోలేకపోయాను... నేరం చేశాను.’’ ‘‘అన్నయ్యా! సంపదకోసం, పేరుప్రతిష్టలకోసం ఉన్నత పదవులకోసం, తనవారి ఉన్నతికోసం, తుచ్ఛమైన ఐహిక సుఖాల కోసం జీవితాలనే పణంగా పెట్టేవాళ్ళు స్వార్థపరులు, నీలా సాటివారి ఆత్మసంతృప్తికోసం, ఆత్మోన్నతికోసం ఆరాటపడుతూ భగవంతుని తోడి ఐక్యత కోసమే పరితపిస్తూ... జన్మసాఫల్యాన్ని పొందగలిగిన వారెందరుంటారు?’’ అంటూ వోదార్పునందించిన తమ్ముడు కృష్ణారావు, ‘‘కర్మయోగి’’గా తన ధ్యేయాన్ని నిర్దేశించుకుని అన్నయ్య రామకృష్ణయ్య తనకై ఆపాదించిన బాధ్యతను స్వీకరించి, తన ఆరాధ్యదైవం జగన్నాథునిలోనే ఐక్యమైపోయిన కర్మయోగి యదార్థగాథ. రసోవైసః అనే వేద సూక్తికి పరిపూర్ణోదాహరణమైన పరబ్రహ్మ తత్త్వానికీ, ఆత్మానంద రసస్వరూపానికీ, మధురప్రేమ తత్త్వానికీ ప్రతీక అయిన శ్రీ కృష్ణతత్త్వం ఒక ఆనంద మహాసాగరి. అందులోని ప్రతి తరంగం ఆధ్యాత్మిక సాధనా మకరందం. కర్మయోగి కథానాయకుడూ - తాతగారూ అయిన కృష్ణారావుగారు ఉగ్గుపాలతో పట్టిన శ్రీ కృష్ణతత్త్వామృతాన్ని అణువణువునా నింపుకుని తాతగారి ఆదేశానుసారం కర్మయోగ ఫలాన్నీ, కర్మత్యాగ యోగాన్నీ అందరికీ అందించాలనీ ఆశయంతో, ఆర్తితో మా కృష్ణక్క (డాక్టర్ కె.వి. కృష్ణకుమారి) అంతరంగం నుండి ఆవిష్క•తమైన అత్యద్భుత రచన - కర్మయోగి.