Book Description
‘‘భర్తగా నేను నీకు లేకపోవచ్చు. కాని, స్నేహితుడిగా నేను నీకు ఎప్పటికీ ఉంటాను’’ పుష్యమి హాండ్ బాగ్ భుజానికి తగిలించుకొని కారు దగ్గరికి నడుస్తూ అంది : ‘‘మీరు తలుచుకొంటే ఏమైనా ఉండగలరు. నా నిగ్రహం మీద నాకే నమ్మకం లేదు. స్నేహం ప్రేమలోకి మారడం లోకసహజం. ప్రేమ స్నేహంగా మారగలదంటే - ఉహు, నేను నమ్మను. నేను మీలాగా మనసు మీద అధికారం సంపాదించిన రోజున, నా మీద నాకు విశ్వాసం ఏర్పడిన రోజున దేశాటనం రద్దు చేసుకొని తిరిగి వస్తాను. అపుడు మీ పద్మనిలయం కార్యక్రమాలలో నేనూ పాల్గొంటాను’’ పుష్యమి కారుడోర్ తెరుచుకొని తండ్రి పక్కన కూర్చొంది. కారు కదులుతూంటే, కారు పక్కగా నడుస్తూ అన్నాడు సరోజ్, ‘‘నువ్వలా తిరిగి వచ్చిన రోజునే నాకు నిజమైన మనశ్శాంతి అని గుర్తుంచుకో. ఆరోజు కోసం ఆశతో నిరీక్షిస్తుంటాను పుష్యమీ’’ అతడి కళ్ళు అప్పటికే ఆర్ర్దమయ్యాయి. కారు కనుమరుగయ్యేదాకా సరోజ్ చెయ్యూపుతూనే ఉన్నాడు.