Book Description
ట్రయిను పరుగులు తీస్తుంటే గుడ్డివాడు చెప్పిన కథనం అందరూ విన్నారు. రెండు నిమిషాలు పెట్టెంతా నిశ్శబ్దంగా ఉన్నది. ‘హంబక్’ అని గట్టిగా విద్యార్ధులలో ఒకడు అరిచాడు. కొందరు నవ్వారు. శ్రీనివాసరావుగారికి నవ్వు రాలేదు. కళ్ళజోడు పెట్టుకున్న ఆయన కళ్ళకు గిర్రున నీళ్ళు తిరిగాయి. ‘‘మరి మీ శీను కళ్ళుపోయాయిగానీ నీవికావుగా. ఉత్తుత్తి కత్తి యుద్ధంలాగానే ఉత్తుత్తి గుడ్డివాడి ఆట ఆడుతున్నావా?’’ ఇంకొక పిల్లవాడు పరిహాసంగా అడిగాడు. ఆంతా తెగ నవ్వారు! ‘‘ఏమిటో బాబూ! చిన్నతనపు పిచ్చి వైరాగ్యం. ఇప్పుడు నాకే నవ్వు వస్తున్నది. తలుచుకుంటుంటే మా అమ్మ అంటుండేది చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని. అందుకే నా కళ్ళలో జిల్లేడు పాలు పిండుకున్నాను. అనుమానంగా ఉంటే మీరే చూడండి’’ అంటూ కూరుకుపోయిన రెప్పలను బలవంతాన పైకి గుంజాడు. అవి అచ్చమైన గుడ్డికళ్ళు!! పెట్టెలోని వాళ్లందరూ బిత్తరపోయారు. గుడ్డివాణ్ణి పరిహాసం పట్టించినందుకు వాడిమీద అప్పటికి జాలి కలిగినట్టుంది. అందరూ తృణమో పణమో ముట్ట చెప్పారు. ట్రయిను ఆగింది. వాడు తడుముకుంటూ పెట్టె దిగి స్టేషనులోని గుంపులో కల్సిపోతున్నాడు. శ్రీనివాసరావుగారు పిచ్చిగా అరిచారు. ‘‘సారధీ! నీ శీనుకు కండ్లు పోలేదు. నేనే నీ శీనును’’ అని. పెట్టెలోని వారు నివ్వెరపోయారు. అప్పటికే గుడ్డివాడు చాలాదూరం వెళ్ళిపోయాడు.