Book Description
చరిత్ర రచనాత్మకంగా చూసినప్పుడు ఈ కాలాన్ని సమకాలిక చరిత్రగా భావించాలి. చరిత్రకారుల అభిప్రాయంలో సమకాలిక చరిత్ర ప్రజల మనోవీథుల్లో ఇంకా తాజాగా ఉన్న వ్యక్తులూ, సంఘటనల గురించి మాట్లాడుతుంది కాబట్టి అది ఒకవైపు వారి దృష్టిని ఆకర్షిస్తూనే, వ్యాఖ్యలను కూడా ఆహ్వానిస్తుంది. ఇటువంటి సమస్యలే ప్రస్తుత సంపుటాన్ని సిద్ధం చేయటంలో మేం ఎదుర్కున్నది. సమకాలిక చారిత్రక సంఘటనలను 1990ల వరకే ఎందుకు రచించాలని తలపెట్టామో మీకు వివరించవలసిన ఆవశ్యకత ఉంది. తెలుగుదేశం పార్టీలో 1995 సెప్టెంబరులో ఆకస్మికంగా జరిగిన అనూహ్యమైన నాయకత్వపు మార్పు వంటి పేర్కొనదగిన అనేక రాజకీయ సంఘటనలతోపాటు భారత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలలోని మార్పు మమ్మల్ని అత్యధికంగా ప్రభావితం చేసింది. భారతదేశం విపణికి అనుకూలమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. నూతన ఆర్థిక విధానాలు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియల చుట్టూ అల్లుకొన్నాయి. ఈ సంపుటంలో 21వ శతాబ్ది ప్రారంభం వరకు చారిత్రక సంఘటనలను వివరించే అధ్యాయాలున్నాయి.