Book Description
వాల్మీకి మహర్షి ఒకరోజు నారదుని ఈ విధంగా అడిగాడు ‘ఓ మహర్షీ! గుణవంతుడు, వీరుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యమునే పలికేవాడు, స్థిరచిత్తం కలవాడు, సదాచార సంపన్నుడు, సర్వభూతములకు మితమును చేయువాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ధైర్యవంతుడు, జాతక్రోధుడు (అరిషడ్వర్గమును జయించినవాడు) ద్యుతిమంతుడు, అసూయలేనివాడు, రోషంకలిగితే దేవతలను సైతం భయకంపితులను చేసే మహాపురుషుడు ఎవరు? అటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని గురించి వినాలని ఆరాటపడుతున్నానని’ వినయంగా అన్నాడు. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి అడిగిన దానికి ఎంతో ఆనందించి, ఒక్క క్షణం కనులు మూసుకుని ఆలోచించి దివ్య స్మ•తితో అంతా గుర్తుకు తెచ్చుకుని ‘లేకనే మహర్షీ! నీవడిగిన ఆ మహాపురుషుడు ఉన్నాడు. అతడు ప్రసిద్ధమైన ఇక్ష్వాకువంశంలో జన్మించిన లోకోత్తరపురుషుడైన శ్రీరాముడు. ఆ మహానుభావుని యందు నీవడిగిన సర్వలక్షణాలు ఉన్నాయి’ అని చెప్పి రామునికథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు. నారదమహర్షి వల్ల విన్న రామకథే కాకుండా, బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల ఇంకా విపులంగా తెలుసుకొన్నవాడై ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుని చరితాన్ని అందమైన శబ్దార్ధాలంకారాలతో ఎంతో అందంగా సమస్త లోకాలకు ఆనందం కలిగించేలా ఏడుకాండలతో, ఐదువందల సర్గలతో, ఇరవైనాగులు వేల శ్లోకాలతో అత్యంత అద్భుతంగా రచించి ఆదికవి అన్న కీర్తిని గడించి, వేదసమానము, ఆదికావ్యము అయిన రామాయణాన్ని చూడ చక్కనివారు, వినచక్కని గొంతుకలవారు, గుణవంతులు, విద్యావంతులు, రాజకుమారులు అయిన లవకుశ కుమారులకు ఉపదేశించాడు. వారా కావ్యాన్ని మనోహరంగా గానంచేస్తూ లోకప్రచారం చేశారు.