Book Description
బి.విఠల ఆచార్య లేదా బి.విఠలాచార్య (జనవరి 28, 1920 - మే 28, 1999) 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 28 న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘిక చిత్రాలే అధికము. ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు. జానపదబ్రహ్మ 1999, మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు. ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కలరు.